జగన్ సారు పత్రిక వాయిస్తూ ఉంది
అధికారం పోతేనే ప్రజల సమస్యలు కనపడతాయేమో మన మీడియాకు. మొన్నటిదాకా కనపడని పులికాట్ సరస్సు సమస్యలన్నీ సాక్షికి ఇప్పుడిప్పుడే కనపడుతున్నాయి.
రాయదొరువు దగ్గర, కొండూరు పాలెం దగ్గర కూడిక తీయించి పులికాట్ సరస్సును బ్రతికించాలట. ఈ పనేదో ఐదేళ్లలో జగన్ సార్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు?
పులికాట్ అంటే అట్లాంటి ఇట్టాంటిది కాదు. ఒకానొక కాలంలో కావేరినది ఇక్కడ సముద్రంలో కలిసేదట. అది ఎంత నిజమో కానీ పులికాటుకు మాత్రం ప్రళయకావేరి అని పేరు ఉంది.
600 చదరపు కిలోమీటర్లు వైశాల్యం ఉండే పులికాట్ సరస్సు ఆరోవంతు భాగం మాత్రమే తమిళనాడులో ఉంటుంది. కానీ ఎండాకాలంలో కూడా ఆ ప్రాంతం నిండుగా నీళ్లతో కళకళలాడుతూ ఉంటుంది.
కానీ మన వైపు ఉండే పులికాట్ మాత్రం ఎప్పుడెప్పుడు ఎండిపోదామా అని ఎదురు ఎదురుచూస్తూ ఉన్నట్టుంటుంది. దానికి కారణం మన ప్రభుత్వం పట్టించుకోదు. ప్రజలూ పట్టించుకోరు.
పులికాట్ ఒక ప్రత్యేక ప్రపంచం. అక్కడి ప్రజల జీవన విధానం చాలా అపురూపమైనది. ఆ ప్రత్యేకత దాదాపు నాశనం అయిపోతూ ఉంది.
శ్రీహరికోట ఇస్రో వల్ల దేశానికి గొప్ప మేలు జరిగింది కానీ పులికాట్‍కు, అక్కడి ప్రజలకు మాత్రం అంతులేని దుఃఖాన్నే మిగిల్చింది. ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పలవర్కాడు రేవు పట్టణం పులికాటుకు ఒకవైపు ఉంది. ఎవరూ చెప్పుకోరు గానీ ప్రపంచంలోనే అతి సుందరమైన బీచుల్లో ఒకటిగా నిలిచే దమ్ము ఉన్న తూపిలి పాలెం బీచ్ పులికాట్‍కు మరో చివరన ఉంది. దానికి దగ్గరలోనే సువర్ణముఖి నది సముద్రంలో కలుస్తుంది.
ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన అతి ప్రాచీన పంట్రంగం శివాలయం కూడా పులికాట్ దీవుల్లోనే ఉంది.
అనాదిగా కొన్ని కోట్ల విదేశీ పక్షులకు తల్లి మన పులికాట్. అవి ఇక్కడే జన్మించి, పెరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోతాయి.
పూడికలు తీయక పులికాట్ లోకి సముద్రం నీళ్లు రావు. కాస్తో కూస్తో నీళ్లున్నచోట నత్త గుల్లల కోసం తవ్వి పారేస్తున్నారు. ఇసుక తవ్వకాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక కబ్జాలు అంటే సరే సరి.
ఇప్పటికే ముక్కాలు భాగం పులికాట్ తన స్వరూపాన్ని కోల్పోయింది. ఇక మిగిలింది పాతికే. .. అదీ సంగతి.
- సాయికిరణ్ పామంజి , 23/1/2025
Comments
Post a Comment